ఇది కోవిడ్, ఇన్‌ఫ్లుయెంజా వంటిది కాదు... ఇది వేరే!: హంటా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ
- ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటా వైరస్
- దీని వ్యాప్తి కరోనా వైరస్ కు పూర్తిగా భిన్నమన్న డాక్టర్ మరియా కెర్ఖోవ్
- సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తుల మధ్యే వ్యాపిస్తుందని వెల్లడి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ఇది కోవిడ్-19 తరహాలో మళ్లీ లాక్‌డౌన్‌లకు దారితీస్తుందా? మాస్కులు ధరించాలా? అనే సందేహాలకు నిపుణులు సమాధానమిచ్చారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎపిడెమిక్ అండ్ పాండమిక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ స్పందిస్తూ, హంటా వైరస్ కోవిడ్ లేదా ఇన్‌ఫ్లుయెంజా వంటిది కాదని, దీని వ్యాప్తి విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక క్రూయిజ్ షిప్‌లో కనిపిస్తున్న ఈ వైరస్ క్లస్టర్, కేవలం పరిమిత పరిధిలో, సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తుల మధ్య మాత్రమే వ్యాపిస్తోందని తెలిపారు. గతంలో 2018-19లో అర్జెంటీనాలో వచ్చిన 'ఆండీస్ వైరస్' తరహాలోనే ఇది కూడా ఒక పరిమితమైన వ్యాప్తిగానే ఉంటుందని, ఇది పెద్ద మహమ్మారిగా మారే అవకాశం లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
హంటా వైరస్‌కు, కోవిడ్-19కు మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం అవి వ్యాపించే విధానం. కోవిడ్-19 గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపించే శ్వాసకోశ వైరస్. కానీ, హంటా వైరస్ ప్రధానంగా జూనోటిక్ వ్యాధి (జంతువుల నుంచి మనుషులకు వచ్చేది). ఇది ఎలుకల మూత్రం, మల విసర్జితాలు లేదా లాలాజలం ద్వారా మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందడం చాలా అరుదు. కేవలం 'ఆండీస్ స్ట్రెయిన్' విషయంలో మాత్రమే సన్నిహిత సంబంధాలు ఉన్నవారి మధ్య వ్యాప్తి కనిపిస్తుంది. కోవిడ్ అంత వేగంగా ఇది వ్యాపించదు కాబట్టి, పెద్ద ఎత్తున మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువని నిపుణులు చెబుతున్నారు.
వ్యాధి సోకిన వారితో కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి ప్రజారోగ్య చర్యలు పాటించడం ద్వారా ఈ వైరస్ గొలుసును సులభంగా తెంచవచ్చని డాక్టర్ అబ్దిరహ్మాన్ మహమూద్ పేర్కొన్నారు. హంటా వైరస్ కేసుల వారీగా చూస్తే కోవిడ్ కంటే ఎక్కువ ప్రాణాంతకమైనది అయినప్పటికీ, అది సమర్థవంతంగా వ్యాపించలేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ఈ వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ (వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడే సమయం) ఆరు వారాల వరకు ఉండవచ్చని, అందుకే మరికొన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథానమ్ గెబ్రియేసస్ తెలిపారు.